

దిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జెన్ జీ యువతకు కీలక సూచనలు చేశారు. జీవితంలో వేగంగా ముందుకు వెళ్లాలనే తొందరలో అడ్డదారులను ఎంచుకుంటే ఎదుగుదల కూడా మధ్యలోనే ఆగిపోతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావంలో అర్థవంతమైన మార్గాలను వదిలిపెట్టవద్దని, స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవిత చరిత్రలను చదివి వారి అనుభవాల నుంచి నేర్చుకోవాలని సూచించారు. రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించే వారికి రైల్వే స్టేషన్లలో కనిపించే హెచ్చరికలను ఉదాహరణగా తీసుకుని, జీవితంలోనూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పారు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. కోవింద్ చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలు ఆయనను మరింత దృఢంగా తీర్చిదిద్దాయని అన్నారు. కోవింద్ తన గ్రామ జీవితం, బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రేమ, కరుణ వంటి విలువలను గ్రామస్థుల నుంచే నేర్చుకున్నానని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాని మోదీ పనితీరు తనపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు. కోవింద్ దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!