

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, తుపాను ప్రభావిత ఘటనలతో తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మృతి చెందగా, మరో 46 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సీతాపుర్‌లో అత్యధికంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,000కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో భారీగా నీరు చేరడంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ముగిసిన 24 గంటల్లో రాష్ట్రంలో 45.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఇదే సమయంలో 1.8 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది.
కాన్పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పుర్, బరేలీ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఘాఘ్రా, రాప్తి నదుల్లో నీటిమట్టాలు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ఉన్నావ్‌లోని సోనిక్ టోల్‌ప్లాజా వద్ద గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నీరు నిలిచింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వీడియోను పంచుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!