

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మూడో వారం ట్విస్టుల మీద ట్విస్టులతో సాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని మిథిలేష్ అనూహ్యంగా బయటకు వెళ్లడం, ముఖేష్ తన పవర్‌ను ఉపయోగించి ఎలిమినేషన్‌ను ఆపడం వంటి పరిణామాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఆదివారం ఎపిసోడ్‌లో మిథిలేష్ వెళ్లిన విషయంపై ముఖేష్, త్రిగుణ్, అమన్ మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది.
ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథిలేష్ బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చి, రూ.15 లక్షలను తన సాంగ్ షూట్‌కు ఉపయోగించుకుంటానని చెప్పాడు. అనంతరం పలువురు కంటెస్టెంట్లకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, గ్రూపులపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా గేమ్ ఆడాలని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత నాగార్జున ‘జంగిల్ థీమ్’లో భాగంగా కంటెస్టెంట్లతో ట్యాగింగ్ గేమ్ ఆడించారు. ఈ సందర్భంగా పలువురు హౌస్‌మేట్స్‌కు ‘కన్నింగ్’, ‘లేజీ’, ‘బ్లైండ్ ఫాలోవర్’, ‘షో ఆఫ్’, ‘అన్నాయింగ్’ వంటి ట్యాగ్‌లు దక్కాయి.
ఇక ఈ ఎపిసోడ్‌లో నటుడు ఫహాద్ ఫాజిల్, సారా, కార్తికేయ కూడా సందడి చేశారు. తమ సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ను ప్రమోట్ చేశారు. అనంతరం హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్‌లుగా విభజించి క్విజ్ నిర్వహించారు. ఈ గేమ్‌లో నరేష్ చురుగ్గా పాల్గొనగా, చివరకు ఫహాద్ ఫాజిల్‌కు చెందిన సూరి టీమ్ విజయం సాధించింది. అనంతరం త్రిగుణ్, రోహిత్, చరణ్, అమన్ వరుసగా సేఫ్ అయ్యారు. చివరికి వర్షిణి, వంశీ ఎలిమినేషన్‌లో మిగిలారు.
ఈ సమయంలో నాగార్జున ముఖేష్‌కు చివరి టెంప్టేషన్ ఇచ్చారు. వర్షిణి లేదా వంశీలో ఒకరిని కాపాడాలంటే కెప్టెన్సీని వదులుకోవడంతో పాటు ఇమ్యూనిటీని కోల్పోవాలని, వచ్చే వారం నేరుగా నామినేషన్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈ షరతులన్నింటికీ ముఖేష్ అంగీకరించాడు. ఇద్దరూ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నానని చెబుతూ ఎలిమినేషన్‌ను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో ముఖేష్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను అపూర్వకు అందజేయగా, టాస్క్‌లో విజయం సాధించిన కారణంగా అపూర్వను కొత్త కెప్టెన్‌గా ప్రకటించారు. వర్షిణి, వంశీ ఇద్దరూ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. ఇక వచ్చే వారం ‘టోటల్ డామినేషన్’ థీమ్‌తో సాగుతుందని నాగార్జున హింట్ ఇవ్వడంతో తదుపరి ఎపిసోడ్లపై ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!