

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి తెలిపారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద శశికుమార్ చివరిసారిగా కనిపించినట్లు సమాచారం.
కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రితో పాటు మరో ముగ్గురు కూడా వరదల్లో చిక్కుకున్నప్పటికీ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను త్వరితగతిన తరలించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు. యాత్రికుల భద్రత, ఆచూకీ కోసం భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్‌తో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!