

దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ధరలకు, వినియోగదారులు చెల్లించే రిటైల్ ధరలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని తగ్గించే మార్గాలను కనుగొనాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)ను ఆదేశించారు. మహారాష్ట్ర రైతులు ఇప్పటికే తక్కువ ధరలకు ఉల్లిపాయలను విక్రయించారని, ప్రస్తుతం నిల్వలు తగ్గిన సమయంలోనూ ధరలు పెరగడం వెనుక కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని చౌహాన్ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ మోడల్ ధర కిలోకు సుమారు రూ.50గా ఉంది. పంజాబ్‌లో రూ.53, ఢిల్లీలో రూ.55, చెన్నై, కోల్‌కతాలో రూ.60, ముంబైలో రూ.48గా నమోదవుతోంది.
ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా రైతుల నుంచి కిలోకు రూ.15–20 చొప్పున ఉల్లిపాయలను కొనుగోలు చేసింది. ఢిల్లీలో వినియోగదారులకు కిలో రూ.35కే విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. నాసిక్ నుంచి కాందా ఎక్స్‌ప్రెస్ ద్వారా 800 టన్నుల బఫర్ స్టాక్ ఢిల్లీకి చేరుకోనుంది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ దుకాణాలు, మొబైల్ వాహనాల ద్వారా నేరుగా వినియోగదారులకు ఉల్లిపాయలను విక్రయించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!