

తెలంగాణ ప్రభుత్వం పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్‌ల పంపిణీలో కీలక మార్పులు తీసుకువచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానాన్ని అమలు చేస్తూ, స్కాలర్షిప్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కాలేజీలకు నేరుగా జమయ్యే ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ చార్జీలు ఇకపై విద్యార్థుల ఖాతాల్లోకే చేరనున్నాయి. ఈ నిర్ణయం SC, ST, BC, EBC, మైనారిటీ మరియు దివ్యాంగ విద్యార్థులకు వర్తించనుంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం స్కాలర్షిప్ మొత్తం జమ అయిన తర్వాత విద్యార్థులు 7 రోజులలోపు సంబంధిత కాలేజీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులే ఈ పథకానికి అర్హులు. ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంకు ఖాతా తప్పనిసరి కాగా, ఈ-పాస్ ద్వారా మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. అలాగే 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివ్యాంగ విద్యార్థులకు అదనంగా 10 శాతం భత్యం అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాత జీవోను రద్దు చేసి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!