

దేశంలోని పారిశ్రామిక, వ్యాపార, కార్పొరేట్ రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళలను గుర్తిస్తూ 2026 క్యాండేర్ హురున్ ఇండియా విమెన్ లీడర్స్ జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 117 మంది మహిళలకు ఇందులో స్థానం దక్కింది. గత ఏడాది 97 మందితో పోలిస్తే ఇది 21 శాతం పెరుగుదల. ఈ మహిళలు నాయకత్వం వహిస్తున్న సంస్థల మొత్తం ఎంటర్ప్రైజ్ విలువ, మార్కెట్ క్యాపిటలైజేషన్, సంపద కలిపి సుమారు రూ.39 లక్షల కోట్లుగా నమోదై, ఫిన్లాండ్ జీడీపీని మించిందని నివేదిక వెల్లడించింది. ఈసారి జాబితాను 9 కేటగిరీల బదులుగా 12 విభాగాల్లో రూపొందించారు.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 84 శాతం మంది స్వయం కృషితో ఎదిగిన మహిళలే కావడం విశేషం. వెల్త్ మల్టీప్లయర్స్ విభాగంలో హెచ్‌సీఎల్‌టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా రూ.2.84 లక్షల కోట్ల నికర సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ప్రొఫెషనల్ సీఈఓ విభాగంలో హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియా నాయర్ మొదటి స్థానాన్ని దక్కించుకుని రూ.5.06 లక్షల కోట్ల విలువైన సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు.
వెటరన్స్ కేటగిరీలో అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. న్యూ ఎకానమీ విభాగంలో రెన్యూ పవర్ సహ వ్యవస్థాపకురాలు వైశాలి నిగమ్ సిన్హా మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో ఉన్న మహిళల సగటు వయస్సు 48 సంవత్సరాలు కాగా, వారి వయస్సు 19 నుంచి 86 సంవత్సరాల మధ్య ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!