

నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. పైప్‌లైన్ నుంచి ముడి చమురును దొంగిలించేందుకు ప్రయత్నించిన సమయంలో విష వాయువులు పీల్చి 37 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ మృతుల సంఖ్యను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. రివర్స్ రాష్ట్రంలోని ఒక్రికా ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానిక పర్యావరణ సంస్థ వెల్లడించింది.
YEAC-నైజీరియా అనే ఎన్‌జీవో వివరాల ప్రకారం కొందరు వ్యక్తులు చమురు పైప్‌లైన్‌కు అక్రమంగా కనెక్షన్ ఇచ్చి ముడి చమురును తమ పడవల్లోకి మళ్లించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో విషపూరిత వాయువులు వెలువడటంతో పలువురు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సమాచారం. మరికొందరి ఆచూకీ కూడా లభించలేదని సంస్థ తెలిపింది. చమురు దొంగతనం ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతుల సంఖ్యను వెల్లడించలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని రివర్స్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి బ్లెస్సింగ్ కబోర్లో అగాబే తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!