

ఎక్స్‌ప్రెస్‌వేలపై వేగ పరిమితిని మించిన వాహనాలకు జారీ చేస్తున్న స్పీడ్ చలాన్ల విషయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వివరాలు వెల్లడించారు. భారతీయ హైవేల భవిష్యత్తుపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నిర్ణీత వేగ పరిమితిలో ప్రయాణించే వాహనాలకు, అలాగే ఆ పరిమితిని 20 శాతం వరకు మించినా చలాన్లు జారీ చేయవద్దని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఢిల్లీ–ముంబై వంటి ఎక్స్‌ప్రెస్‌వేలపై వాహనదారులకు అనవసరంగా స్పీడింగ్ నోటీసులు అందుతున్నాయనే సమస్యను తగ్గించేందుకు ఈ సూచనలు చేసినట్లు వివరించారు. ఉదాహరణకు, గంటకు 120 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న రహదారిపై 20 శాతం అదనపు మార్జిన్‌తో 144 కిలోమీటర్ల వరకు చలాన్ విధించకూడదని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఈ పరిమితిని మించినప్పుడు జరిమానా విధించాలని సూచించినట్లు తెలిపారు.
మరోవైపు, జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ATMS) తీసుకురావాలని గడ్కరీ ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ ద్వారా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, లేన్ డిసిప్లిన్ పాటిస్తున్నారా లేదా అనే విషయాలను పర్యవేక్షించవచ్చు. బస్సులు, లారీలు, కార్లు నిర్దేశించిన లేన్లలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ప్రతి రహదారిపై వాహనాల రకాన్ని బట్టి వేగ పరిమితులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వాహనదారులు ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసిన వేగ పరిమితి బోర్డులను తప్పనిసరిగా పాటించాలి. గడ్కరీ వ్యాఖ్యలను దేశంలోని అన్ని హైవేలపై వేగ పరిమితులు మారినట్లుగా భావించకూడదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!