

చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను మరింతగా స్వీకరించేలా ప్రోత్సహించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ‘యూపీఐ వ్యాపార్ సక్షమ్ స్కీమ్’ను ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించి ఎన్పీసీఐ సర్క్యులర్ జారీ చేసింది. ఏడాదికి రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు ఈ పథకం కింద ప్రోత్సాహకాలకు అర్హులు. కొత్త వ్యాపార ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసుకుంటే రూ.300, సౌండ్‌బాక్స్ ఏర్పాటు చేసుకుంటే రూ.750 ప్రోత్సాహకంగా అందించనున్నారు. చిన్న వ్యాపారాల్లో యూపీఐ చెల్లింపుల వినియోగాన్ని పెంచడం, డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
టైర్-3 నుంచి టైర్-6 నగరాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలపై ఈ పథకంలో ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రూ.2,000 వరకు జరిగే అర్హత కలిగిన యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. యూపీఐ సభ్యులకు చెందిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వాటాలో 5 శాతాన్ని ఈ పథకం నిధికి కేటాయించనున్నట్లు ఎన్పీసీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. ఎండీఆర్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి మూడేళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. క్యూఆర్ కోడ్లు, సౌండ్‌బాక్స్‌ల వినియోగాన్ని పెంచడం ద్వారా చిన్న వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలోకి తీసుకురావాలని ఎన్పీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!