

పాకిస్థాన్ తీవ్ర ఇంధన కొరత, పెరుగుతున్న ఇంధన వ్యయాలు, అంతర్జాతీయ ముడిచమురు ధరల హెచ్చుతగ్గులతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు కఠిన పొదుపు చర్యలను అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం షాపింగ్ మాల్స్, మార్కెట్లు రాత్రి 9 గంటలకే మూసివేయాలి. వివాహ వేడుకలు, ఫంక్షన్ హాళ్లు రాత్రి 10 గంటలలోపు మూసివేయాలని ఆదేశించారు. పెళ్లి విందుల్లో ఒకే ఒక్క వంటకాన్ని వడ్డించేందుకు పరిమితి విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. హోమ్ డెలివరీ, టేక్ అవే సేవలకు మాత్రం ఈ సమయ పరిమితుల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ప్రభుత్వ యంత్రాంగంపైనా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ అధికారుల వాహనాలకు కేటాయించే ఉచిత పెట్రోల్, డీజిల్ కోటాలో 50 శాతం కోత విధించారు. మూడు నెలల పాటు విదేశీ పర్యటనలు, కొత్త ప్రభుత్వ వాహనాల కొనుగోళ్లపై పరిమితులు అమలు చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష సమావేశాలకు బదులుగా టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం రవాణా, నిత్యావసరాలపై కూడా కనిపిస్తోంది. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లకు ఉపశమనం కల్పించేందుకు సబ్సిడీ ప్రకటించినప్పటికీ, ఇంధన సంక్షోభం ప్రభావం కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!