

పెళ్లికి సరిగ్గా నెల రోజుల ముందు యువరాజ్ సింగ్ మంచందా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సెప్టెంబర్ 6న తన సోదరీమణులతో కలిసి ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్‌కు వెళ్లిన యువరాజ్.. పెళ్లి కోసం షెర్వాణీతో పాటు ఇతర దుస్తులు కొనుగోలు చేశాడు. అనంతరం గురుగ్రామ్‌లో మాజీ సహోద్యోగితో అత్యవసర సమావేశం ఉందని చెప్పి అక్కడికి వెళ్లాడు. రాత్రి 10 గంటలలోపు ఇంటికి వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినప్పటికీ, తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో రోజుల తరబడి అతడి ఆచూకీ లభించలేదు. దీంతో సెప్టెంబర్ 11న కుటుంబ సభ్యులు లజ్‌పత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో మాజీ సహోద్యోగిని వాట్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఆమెను, ఆమె భాగస్వామిని ఉత్తరాఖండ్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో యువరాజ్‌ను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
యువరాజ్ మృతదేహాన్ని మురుగు కాలువలో పడేసినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 10న మృతదేహాన్ని గుర్తించిన గురుగ్రామ్ పోలీసులు, సెప్టెంబర్ 14న దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని యువరాజ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతడిని చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా తమకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి సంపాదించే వ్యక్తి యువరాజ్ ఒక్కడేనని, అతడి మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని తెలిపారు. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!