

శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభకార్యాల సందడి మొదలైంది. పూజలు, వ్రతాలతో పాటు వివాహ వేడుకలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, డెకరేషన్, ఫొటోగ్రఫీ, మేకప్, బంగారం, వస్త్ర దుకాణాలకు గిరాకీ పెరుగుతోంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 5 వరకు వివాహాలకు అనుకూలమైన రోజులు ఉన్నప్పటికీ, అన్ని విధాలుగా కలిసొచ్చే ముహూర్తాలు పరిమితంగానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఫంక్షన్ హాళ్లకు ఇప్పటికే భారీగా ముందస్తు బుకింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఖాళీలు దొరకడం లేదు. మెహందీ, సంగీత్, హల్దీ, రిసెప్షన్ వంటి కార్యక్రమాలతో పెళ్లిళ్లు రెండు, మూడు రోజుల వేడుకలుగా మారడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని చంపాపేటకు చెందిన ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు గోవింద్ రెడ్డి తెలిపారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల అద్దెలు కూడా పెరిగాయి.
ఆగస్టు 15, 16, 21, 22, 23, 26, 27, 28, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో మంచి, మధ్యస్థ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ కాలం తర్వాత అక్టోబర్ 29 వరకు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో చాలా కుటుంబాలు ఈ స్వల్ప వ్యవధిలోనే పెళ్లిళ్లు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. పురోహితుడు ఘంటన్న శాస్త్రి మాట్లాడుతూ. గతంలో లగ్నం, తిథి, నక్షత్రం, జాతకాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకునేవారని, ఇప్పుడు కుటుంబ సభ్యుల సౌకర్యం, బంధుమిత్రుల అందుబాటు, ఫంక్షన్ హాల్ లభ్యత వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. చివరి నిమిషంలో ఇబ్బందులు రాకుండా ఆషాఢ మాసంలోనే ఏర్పాట్లు పూర్తి చేసి ఆగస్టు 22న పెళ్లి నిర్ణయించుకున్నామని ఓ వధువు తండ్రి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!