

పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ కేసుల్లో నిందితులకు త్వరితగతిన విచారణ జరిపి కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని పేర్కొన్న ఆయన, ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి సంబంధిత అధికారులు అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.
విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు పరీక్షల వ్యవస్థ విశ్వసనీయతను పరిరక్షించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీక్‌ల ద్వారా దేశ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరిస్తూ, పారదర్శకమైన మరియు నిష్పక్షపాత పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!