

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ను సందర్శించి భారత క్రీడా భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్న ఆయన, 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ ప్రపంచస్థాయి క్రీడా ఈవెంట్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహించనున్న విషయం తనకు ఎంతో ఆనందంగా ఉందని, భారతదేశంలో ఏ అంతర్జాతీయ క్రీడా లీగ్ ఈవెంట్ జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందుతుందని అన్నారు.
ఎంసీజీ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ యువ క్రికెటర్లతో ముచ్చటించి వారి జెర్సీలపై సంతకాలు చేశారు. అనంతరం క్రీడా ప్రతిభావంతులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు. ఆస్ట్రేలియా అధికారిక మస్కాట్ "రూబీ ది రూ"తో సరదాగా ఫొటోలు దిగిన మోదీని, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కూడా కలిశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "ఎంసీజీలో అడుగుపెట్టగానే ప్రతి భారతీయుడికి భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ పోరాటాల జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. క్రికెట్ మన రెండు దేశాలకు కేవలం ఆట మాత్రమే కాదు, ఒక ఉమ్మడి అభిరుచి కూడా" అని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!