

విశాఖపట్నం నగరంలో పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో అక్టోబర్ 10 రాత్రి నగరవ్యాప్తంగా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం 93 మంది పోలీసు సిబ్బందితో 31 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా లైసెన్సులు, అనుమతులను పరిశీలించగా, ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయాలు, ఫుడ్, ట్రేడ్, లేబర్ లైసెన్సుల కొరత వంటి ఉల్లంఘనలు గుర్తించారు.
వాణిజ్య వంటశాలల్లో గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల వాడకం, అగ్నిమాపక భద్రతా అనుమతులు లేకపోవడం, పార్కింగ్ సౌకర్యాల్లో లోపాలు, అనుమతించిన సమయం దాటినా కార్యకలాపాలు కొనసాగించడం వంటి అంశాలను పోలీసులు గుర్తించారు. నిబంధనల్లోని లోపాలను సరిచేసుకోవాలని యాజమాన్యాలకు సూచిస్తూ, ఉల్లంఘనలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత, అక్రమ కార్యకలాపాల నియంత్రణే లక్ష్యమని పేర్కొంటూ, ఫిర్యాదులు లేదా సమాచారం కోసం 7995095799 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!