

అమెరికాలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యంలో టెక్సాస్‌లోని దక్షిణాసియా సంతతి ప్రజల రాజకీయ అభిప్రాయాలపై నిర్వహించిన తాజా సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. సౌత్ ఏషియన్ అమెరికన్ వోటర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ టెక్సాస్ ఎడ్యుకేషన్ ఫండ్ (SAAVETX EF), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డియేగో సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. సర్వేలో పాల్గొన్న నమోదిత దక్షిణాసియా ఓటర్లలో 66 శాతం మంది సెనేట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ టెలరికోకు మద్దతు తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్స్‌టన్‌కు 21 శాతం మంది మద్దతు పలికారు. గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జీనా హినోజోసాకు 63 శాతం మంది, ప్రస్తుత రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్‌కు 27 శాతం మంది మద్దతు తెలిపారు. టెక్సాస్‌లో నివసిస్తున్న 1,000 మంది దక్షిణాసియా పెద్దల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే రూపొందించారు.
దక్షిణాసియా సమాజం ఎదుర్కొంటున్న వివక్ష, రాజకీయ ప్రాతినిధ్య సమస్యలను కూడా ఈ సర్వే ప్రస్తావించింది. గత ఏడాది కాలంలో టెక్సాస్‌లో కనీసం ఒక రూపంలోనైనా విద్వేషపూరిత ఘటనను ఎదుర్కొన్నామని 58 శాతం మంది తెలిపారు. ఆన్‌లైన్ వేధింపులు, హింసకు సంబంధించిన బెదిరింపులు, ప్రార్థనా స్థలాలపై దాడులు వంటి ఘటనలు ఇందులో ఉన్నాయి. దక్షిణాసియా ప్రజలను లేదా వలసదారులను తరచుగా ‘బయటివారు’, ‘ఆక్రమణదారులు’ అని అభివర్ణించడం విన్నామని 64 శాతం మంది చెప్పారు. ప్రజాప్రతినిధులు తమ సమాజ సమస్యలను సరిగా అర్థం చేసుకోవడం లేదని అదే శాతం మంది అభిప్రాయపడగా, తమకు రాజకీయంగా పెద్దగా ప్రభావం లేదని 54 శాతం మంది పేర్కొన్నారు. ఈ పరిస్థితులు సమాజంలో భద్రత, గుర్తింపు, రాజకీయ భాగస్వామ్యంపై ప్రభావం చూపుతున్నాయని సర్వే నివేదిక వివరించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!