

తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమనంతో కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను స్వయంగా అధ్యయనం చేస్తానని తెలిపారు.
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడకు సంబంధించిన డిజైన్, డీపీఆర్ పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కోనపాపపేట వరకు రక్షణ గోడ పొడిగింపు ప్రతిపాదనలపై కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను అలల కారణంగా దెబ్బతిన్న ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని తెలిపారు. 92 తీర ప్రాంత ఆవాసాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను 102 పునరావాస కేంద్రాలకు తరలించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఇళ్లు, పంటలు, పడవలు, వలలు తదితర ఆస్తులకు జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేసి పరిహారం అందించేలా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బాధితులకు బియ్యం, పప్పు, నూనెతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందించాలని, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని సూచించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సేవలను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!