

ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీకి ఉన్న మెజారిటీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థకు విక్రయించాలన్న ప్రతిపాదన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులకు మద్దతు తెలిపారు. లాభాల బాటలో ఉన్న బ్యాంకును విక్రయించడం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పాలనలో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యాపారవేత్తలకు నిబంధనలు పట్టించుకోకుండా రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో మొండి బకాయిల కారణంగా ఐడీబీఐ బ్యాంక్ తీవ్ర నష్టాలను ఎదుర్కొందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.25 వేల కోట్లకు పైగా మూలధనాన్ని సమకూర్చి బ్యాంకును పునరుద్ధరించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బ్యాంకు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో అన్ని నిబంధనలను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. కాగా, ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం, ఎల్‌ఐసీకి ఉన్న 60.72 శాతం వాటాను రూ.52,878 కోట్లకు ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విక్రయించేందుకు అక్టోబర్ 14న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బ్యాంకు ఉద్యోగుల సంఘం విక్రయ ప్రక్రియను నిలిపివేసి, పార్లమెంటరీ పర్యవేక్షణలో సమీక్షించాలని డిమాండ్ చేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!