

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. విజయనగరం జిల్లాలో నిర్మించిన ప్రతిష్ఠాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి కమర్షియల్ విమానంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రయాణికుల్లో ఉత్సాహం కనిపించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ. ఆధునిక సదుపాయాలతో జీఎంఆర్ నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త గుర్తింపు తీసుకురానుందని అన్నారు.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం విమానాశ్రయంలోని కొన్ని కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వరకు రహదారుల అభివృద్ధితో పాటు బీచ్ కారిడార్ పనులను కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయం, మెరుగైన రవాణా సదుపాయాలు, బీచ్ కారిడార్ వంటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!