

ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనుల్లో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ-వేలంలో ఈ రెండు బొగ్గు బ్లాక్‌లను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడితో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి సంస్థ సిద్ధమవుతోంది. ఇటీవల రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ప్రాజెక్టు కార్యాచరణ, అమలు ప్రణాళికను వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
చింతలపూడి బ్లాక్‌లో సుమారు 904.94 మిలియన్ టన్నులు, రేచెర్ల బ్లాక్‌లో 2,225.67 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. మొత్తం 3,130.61 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను సంప్రదాయ పద్ధతిలో తవ్వడం కంటే భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ సాంకేతికతతో వినియోగించనున్నారు. భూమికి 600 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును గ్యాస్ రూపంలో మార్చి వినియోగించే ఈ ప్రాజెక్టు దేశంలోనే తొలి అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుగా నిలవనుంది. 2029 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!