

కేంద్ర–రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో తెలంగాణ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. భిన్న రాష్ట్రాల ప్రయోజనాలు ఎదురైనప్పటికీ న్యాయబద్ధమైన, సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనగలగడమే సమాఖ్య వ్యవస్థకు అసలైన పరీక్ష అని పేర్కొన్నారు.
పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రతిభ కోసం రాష్ట్రాల మధ్య పోటీ సహజమేనని భట్టి విక్రమార్క అన్నారు. నదులు, విద్యుత్ వ్యవస్థలు, కార్మికులు, వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు అడ్డంకులు కావని పేర్కొన్నారు. పరస్పర ఆధారిత పరిస్థితుల్లో దక్షిణ ప్రాంతీయ మండలి వంటి వేదికల ప్రాధాన్యం మరింత పెరుగుతోందన్నారు. 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటిస్తూ, రాష్ట్రాల మధ్య సమస్యలకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆకాంక్షించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!