

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2లో భాగంగా పాతబస్తీ మెట్రో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌కు సంబంధించిన రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, మెట్రో విస్తరణకు అవసరమైన పెండింగ్ భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు.
హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బోగీలను జత చేయడంతో పాటు కొత్త మెట్రో కోచ్‌ల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట కారిడార్‌లో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంపై ఢిల్లీ మెట్రో అధికారులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!