

దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించి ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ సూచించారు. పాలపిట్టల సంరక్షణ, చైనా మాంజా విక్రయాల నియంత్రణపై సోమవారం అరణ్యభవన్‌లో అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. పాలపిట్టలు ఎగురుతూ ఆహారం తీసుకోవడం వాటి ప్రత్యేక లక్షణమని, పంజరాల్లో బంధిస్తే ఆహారం తీసుకోలేక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత దసరా సందర్భంగా బంధించిన 28 పాలపిట్టలను స్వాధీనం చేసుకుని తిరిగి అడవిలోకి విడుదల చేసినట్లు వెల్లడించారు. దసరా ఉత్సవాల్లో పాలపిట్టలను బంధించకుండా చూడాలని దేవాదాయశాఖ అధికారులను కోరారు. గ్రామస్థాయి అధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నాయకుల వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
చైనా మాంజా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న నేపథ్యంలో దాని విక్రయాలపై నిఘా పెంచాలని వినయ్‌కుమార్ సూచించారు. చైనా మాంజా వల్ల పక్షులతో పాటు ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉన్నందున దాని విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని అంతర్జాల వాణిజ్య వేదికల్లో చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు అమల్లో ఉన్న నేపథ్యంలో సంబంధిత సంస్థలపై నిఘా పెట్టడంతో పాటు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. పాలపిట్టల సంరక్షణ కోసం అటవీశాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారులు ప్రియాంక వర్గీస్, ఎస్.జె. ఆశ, క్షితిజ, సి.ఎఫ్. ప్రసాద్‌తో పాటు డెక్కన్ బర్డర్స్, హైటియోస్, ఏడబ్ల్యూసీఎస్, పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!