

తమిళనాడులో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పలు కీలక అంశాలను లేవనెత్తారు. కావేరి జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, సంబంధిత అథారిటీల నిర్ణయాలను అమలు చేయాలని కోరారు. తమిళనాడుకు నీట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని, MBBS, BDS, AYUSH రాష్ట్ర కోటా సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునేలా అనుమతించాలని డిమాండ్ చేశారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చట్టబద్ధ హామీ ఇవ్వాలని కోరారు. జీఎస్టీ తర్వాత రాష్ట్రాల సొంత పన్ను ఆదాయ వనరులు పరిమితమైన నేపథ్యంలో న్యాయమైన ఆర్థిక వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలను సమగ్ర ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయడం, ఉమ్మడి పారిశ్రామిక కారిడార్లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయడం, బొమ్మసంద్ర-హోసూర్ మెట్రో విస్తరణను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే డ్రగ్స్ రవాణా, తయారీ, పంపిణీపై రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని, ఆన్‌లైన్‌లో ప్రిస్క్రిప్షన్ మందుల అక్రమ విక్రయాలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోర్టులు, కోస్టల్ షిప్పింగ్, మత్స్య పరిశ్రమ, సముద్ర పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వాలని, 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు బ్లూ ఎకానమీలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బలమైన రాష్ట్రాలతోనే బలమైన భారత్ నిర్మాణం సాధ్యమని విజయ్ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!