

మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తమపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ గాంధీ భవన్‌ను ఆశ్రయించారు. ఇటీవల మల్హర్ మండలం కొయ్యూరులో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి పాల్గొన్న ఇద్దరు గిరిజన కార్యకర్తలు, ఒక మైనార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో కొయ్యూరు ఉపసర్పంచ్, ఒక వార్డు సభ్యుడు, మరో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఉన్నారు. కేవలం కాంగ్రెస్ ఎంపీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైనందుకే తమపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కార్యకర్తలు లేఖ సమర్పించారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకే ఈ సస్పెన్షన్లు విధించారని వారు లేఖలో ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని పేర్కొన్నారు. మల్హర్ మండల పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం ఈ వ్యవహారంపై పునరాలోచించి, సస్పెన్షన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!