

2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. బీమా ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. దీంతో అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు.
ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.2.5 లక్షలు బీమా పరిహారం అందుతుంది. ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందితే గరిష్ఠంగా రూ.25 వేల వరకు వైద్య సహాయం అందుతుంది. 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ కల్పించేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. మత్స్యకారులు, వారి కుటుంబాలకు సమగ్ర సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!