

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వుల అమలుపై ఆగస్టు 12న హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ప్రత్యేక చట్టసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా పథకాలను అమలు చేయడం రాజ్యాంగబద్ధమేనా అని కోర్టు ప్రశ్నించింది.
ఈ పథకాల అమలుకు ప్రత్యేక చట్టసభ ఆమోదం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వాదించారు. భారీగా ప్రజాధనం ఖర్చు చేయడంపై చట్టబద్ధతను కూడా ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో జరిగిన జాప్యంపై గత విచారణలో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్‌లో ఆర్టికల్ 162ను తప్పుగా ప్రస్తావించడంపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ క్లరికల్ తప్పిదంగా పరిగణించలేమని పేర్కొంటూ, తప్పిదం ఎలా జరిగిందో వివరించాలని ఆదేశించారు.
భూసేకరణ పరిహారాలు పెండింగ్‌లో ఉన్న సమయంలో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడంపై కూడా హైకోర్టు ప్రశ్నలు సంధించింది. రాష్ట్ర ఆర్థిక ప్రాధాన్యతలు, అప్పుల పరిస్థితి, పథకాలకు నిధులను రుణాల ద్వారా సమకూరుస్తున్నారా అనే అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. నేటి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారుల్లో ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!