

హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక పథకాన్ని రూపొందిస్తోంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా వాటి స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ఆటోలను అందించే విధంగా “తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026”ను రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ పథకానికి ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో పట్టణ ప్రజా రవాణాను క్రమంగా నెట్-జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పట్టణాల్లో చివరి మైలు రవాణాలో ఆటో రిక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలు ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో CURE ప్రాంతంలోని అర్హత కలిగిన అన్ని ICE ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు సమగ్ర పథకాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. రవాణా శాఖ అధికారిక డేటా ప్రకారం CURE ప్రాంతంలో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌తో 18,766 అర్హత కలిగిన ICE ఆటోలు ఉన్నాయి. వీటిలో 11,254 డీజిల్ ఆటోలు, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడు తన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాదించే రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!