

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డు దక్కనుంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబరు 11న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ తరఫున హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొని పురస్కారాన్ని అందుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, కేంద్ర సహాయ మంత్రి తోఖన్ సాహు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ – పట్టణ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో చేపట్టిన పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటించారు. నవంబరు 11న సాయంత్రం 4 గంటలకు విజ్ఞాన్ భవన్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం కానుంది. అంతకుముందు రాష్ట్రపతి అవార్డు గ్రహీతలతో సమూహ ఛాయాచిత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ దశాబ్ది సహా పలు లఘుచిత్రాలను ప్రదర్శించి, జాతీయ స్థాయి పురస్కారాలను అందజేయనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!