

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) డిప్యూటీ ఈవో మెండు లోకనాథాన్ని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు భార్య సోదరుల ఇళ్లు, ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగలోని ఆయన తమ్ముడి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం 9 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. అనంతరం పంచనామా పూర్తి చేసి లోకనాథాన్ని అరెస్టు చేసి తిరుపతిలోని ఏసీబీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. రుయా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.
ఏసీబీ సోదాల్లో లోకనాథం, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల పేరిట సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం వాటి మొత్తం విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. తనిఖీల్లో రెండు కిలోల బంగారం, 6.5 కిలోల వెండి వస్తువులు, రూ.12.50 లక్షల నగదుతో పాటు నివాస భవనాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ‘డిప్యూటీ ఈవోగా పనిచేస్తూ కోట్ల విలువైన ఆస్తులను ఎలా సంపాదించారు?’ అని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, తాను ఆస్తులను చట్టబద్ధంగానే సంపాదించానని లోకనాథం సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!