

తిరుమలలో రద్దీ సమయాల్లో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని మరింత వేగవంతంగా, సులభంగా నిర్వహించేందుకు టీటీడీ వినూత్న కన్వేయర్ తరహా మూవింగ్ టేబుల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, క్యాటరింగ్ విభాగాల సమన్వయంతో రూపొందించిన ఈ టేబుల్ నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చయ్యాయి. ఏడు మీటర్ల పొడవున్న ఈ టేబుల్‌పై ఉంచిన ప్రసాదాల ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉండటంతో భక్తులు క్యూలో నడుస్తూనే సులభంగా వాటిని తీసుకునే అవకాశం కలుగుతోంది. ఖాళీ అయిన ప్రదేశాల్లో శ్రీవారి సేవకులు వెంటనే కొత్త ప్లేట్లను ఉంచే విధంగా వ్యవస్థ రూపొందించారు.
గత నెల తిరుమల రింగ్ రోడ్ ప్రాంతంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా విజయవంతమైంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు, ఇతర క్యూ మార్గాల్లో మరో పది మూవింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసేందుకు టీటీడీ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఏడు మీటర్ల పొడవున్న టేబుళ్లను భవిష్యత్తులో 12 నుంచి 15 మీటర్ల వరకు విస్తరించే ప్రతిపాదనలను ఇంజినీరింగ్ విభాగం సిద్ధం చేస్తోంది. దీంతో రద్దీ సమయంలో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ మరింత వేగంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!