

ఫ్యూచర్ సిటీలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారి మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతర్గత ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, హైస్పీడ్ కనెక్టివిటీని పెంచడం లక్ష్యంగా లింక్ రోడ్లు, ప్రధాన రహదారులు, కల్వర్టుల విస్తరణకు రూ.140 కోట్ల నిధులను మంజూరు చేసింది. బెంగళూరు జాతీయ రహదారి-844, శ్రీశైలం జాతీయ రహదారి-765, నాగార్జునసాగర్ రహదారుల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు పలు గ్రామాలను ప్రధాన రహదారులతో కలపనున్నారు.
మీర్‌ఖాన్‌పేట, మేడిపల్లి, మల్కీజుగూడ, నందివనపర్తి, యాచారం, నానక్‌నగర్, పిల్లిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, రాచలూరు, తిమ్మాపూర్, కొనల్‌గూడ తదితర ప్రాంతాలను కలుపుతూ పలు లింక్ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. లింక్ రోడ్ల నుంచి ప్రధాన గ్రామపంచాయతీలకు అనుసంధానంగా రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు. ఈ పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఎఫ్‌సీడీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-13 నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా అమన్‌గల్ మండలం ఆకుతోటపల్లి వరకు 41.5 కిలోమీటర్ల మేర 100 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తోంది. ఫ్యూచర్ సిటీలోని పారిశ్రామిక, ఐటీ, నివాస ప్రాంతాల్లో సిగ్నల్ రహిత కూడళ్లను ఏర్పాటు చేసి జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!