

అమెరికా తొలిసారి అంతరిక్ష కక్ష్యలో ‘స్పేస్ కంట్రోల్ వెపన్స్’ మోహరించినట్లు అధికారికంగా అంగీకరించింది. ‘ఎయిర్, స్పేస్, సైబర్ కాన్ఫరెన్స్’లో అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ ఈ విషయాన్ని వెల్లడించారు. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొని అమెరికా, మిత్ర దేశాల బలగాలను రక్షించేందుకు ఈ ఆయుధ వ్యవస్థలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. అయితే అవి ఎలాంటి ఆయుధాలు, వాటి సామర్థ్యాలు ఏమిటి, ఎప్పుడు కక్ష్యలోకి పంపారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆ వివరాలు బయటపెట్టడం నిరోధక సామర్థ్యానికి ఉపయోగపడదని మెయింక్ పేర్కొన్నారు.
అంతరిక్షంలో సైనిక ఆధిపత్యం కోసం అమెరికా, చైనా, రష్యా మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కమ్యూనికేషన్, నావిగేషన్, నిఘా, క్షిపణి హెచ్చరికలకు ఉపయోగించే ఉపగ్రహాలు ఆధునిక యుద్ధాల్లో కీలకంగా మారాయి. చైనా, రష్యాలు కూడా కౌంటర్-స్పేస్ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాయని అమెరికా చాలాకాలంగా చెబుతోంది. 1967 నాటి ఔటర్ స్పేస్ ఒప్పందం కక్ష్యలో సామూహిక విధ్వంసక ఆయుధాల మోహరింపును నిషేధిస్తుంది. అయితే అన్ని రకాల అంతరిక్ష ఆయుధాలపై సంపూర్ణ నిషేధం లేదు. దీంతో అమెరికా తాజా ప్రకటన అంతరిక్షం సైనికీకరణ, భవిష్యత్తులో కక్ష్యలో ఆయుధ పోటీపై ఆందోళనలను మరింత పెంచే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!