

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఐరాస 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మధ్య జరిగిన చర్చల్లో హర్మూజ్ జలసంధి అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ కీలక జలమార్గాన్ని తిరిగి తెరవాలంటే అమెరికా నౌకా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, తమ మిత్ర కూటములపై జరుగుతున్న దాడులను నిలిపివేయడం వంటి షరతులను ఇరాన్ అమెరికా ముందు ఉంచినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చలు సానుకూలంగా సాగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలో మరో దఫా చర్చలు జరగనున్నట్లు తెలిపారు.
మరోవైపు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు న్యూయార్క్‌లో చర్చలు జరుపుతున్న సమయంలోనే హర్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ ఖేష్మ్ ద్వీపం వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. పేలుళ్లు సముద్రం వైపు నుంచి వినిపించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. అయితే వాటికి కారణం, జరిగిన నష్టం గురించి వెంటనే స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఐరాస ప్రసంగంలో ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేసినప్పటికీ, ఒప్పందానికి అవకాశం ఉందన్న సంకేతాలు కూడా ఇచ్చారు. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే సుమారు వారంలో హర్మూజ్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!