

కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, కృష్ణ జన్మాష్టమి పేర్లతో పిలిచే ఈ పర్వదినం వచ్చేసింది. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ నెల 4న జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయాలతో పాటు ఇళ్లలోనూ ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. చిన్నికృష్ణుడి చిలిపి చేష్టలు, ఉట్టి ఉత్సవాలతో పాటు ఉత్తర భారతదేశంలో 56 రకాల వంటకాలతో సమర్పించే ‘ఛప్పన్ భోగ్’ మహా నైవేద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
పురాణాల ప్రకారం, ఇంద్రుడి ఆగ్రహంతో బ్రజభూమిలో భారీ వర్షాలు కురిసినప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి గొడుగులా పట్టుకుని బ్రజవాసులను ఏడు పగళ్లు, ఏడు రాత్రులు కాపాడాడు. ఆ సమయంలో కృష్ణుడు రోజుకు ఎనిమిది సార్లు భోజనం చేసే వాడని, ఏడు రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడంతో 56 భోజన వేళలు కోల్పోయాడని బ్రజవాసులు భావించారట. వర్షాలు తగ్గిన అనంతరం ప్రేమతో 56 రకాల వంటకాలను తయారు చేసి కృష్ణుడికి సమర్పించారని, అప్పటి నుంచి ‘ఛప్పన్ భోగ్’ సంప్రదాయం కొనసాగుతోందని విశ్వాసం.
ఛప్పన్ భోగ్‌లో ప్రాంతీయ, ఆలయ సంప్రదాయాలను బట్టి వంటకాలు మారుతుంటాయి. లడ్డూలు, పేడాలు, జిలేబీ, రబడీ, వెన్న-మిశ్రీ, పాయసాలు, పూరీలు, కచోరీలు, అన్నం, పప్పు, కూరగాయల వంటకాలతో పాటు పండ్లు, డ్రై ఫ్రూట్స్, చట్నీలు, ఊరగాయలు వంటి వాటిని సమర్పిస్తారు. అయితే 56 రకాల వంటకాలు సిద్ధం చేయడం సాధ్యం కాకపోయినా భక్తితో సమర్పించే ఏ నైవేద్యమైనా ముఖ్యమేనని భక్తులు విశ్వసిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ‘పత్రం పుష్పం ఫలం తోయం’ భావం ప్రకారం, స్వచ్ఛమైన మనసుతో సమర్పించే తులసి దళం, పండు లేదా నీరు కూడా ఆయనకు ప్రీతికరమేనని నమ్మకం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!