

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోయినా అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పుల భారాన్ని మిగిల్చిందని ఆరోపిస్తూ, రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కొనసాగించడంతో పాటు సర్పంచ్‌ల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ మంచి రికార్డు సాధించిందని మంత్రి తెలిపారు.
ప్రతీ పంటలో రైతులకు భద్రత, భరోసా కల్పిస్తున్నామని పొంగులేటి అన్నారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టామని, ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు మెచ్చుకోవడం లేదని అన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీ బలంగా ఉందని వ్యాఖ్యానించారు. మహిళల కోసం చీరల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!