

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా యువ ఇంజినీర్లు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి కల్పించే వారిగా, సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కర్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. గండిపేటలోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో జరిగిన 6వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, 2026లో పట్టభద్రులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. స్నాతకోత్సవం అనేది కేవలం డిగ్రీలు అందుకునే వేడుక మాత్రమే కాకుండా దేశ భవిష్యత్ నిర్మాణ బాధ్యతలను యువతకు అప్పగించే పవిత్ర ఘట్టమని పేర్కొన్నారు.
తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి సాంకేతికత, పరిశోధన, స్టార్టప్‌లు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా ఎదిగిందని గవర్నర్ అన్నారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధన, హరిత శక్తి వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, విలువలు, నైతికత, క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వమే నిజమైన విద్యకు గుర్తు అని చెప్పారు. యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి 'నశాముక్త్ భారత్' లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకుని సమాజ సేవకు అంకితమవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!