

విభిన్న కథలు, విలక్షణమైన పాత్రలతో తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్న ఆయన తాజా చిత్రం ‘బత్తా’ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’తో పాటు తమిళంలోనూ పలు ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి అభిమానులను ఖుషీ చేసే మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
విజయ్ సేతుపతి కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలిచిన ‘సూపర్ డీలక్స్’కు దర్శకత్వం వహించిన త్యాగరాజన్ కుమారరాజాతో ఆయన మరోసారి కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘పాకెట్ నోవెల్’ (Pocket Novel) పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘బత్తా’కు వస్తున్న స్పందన నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా కథ, నటీనటులు, సాంకేతిక బృందం, విడుదల తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈసారి ఈ క్రేజీ కాంబో ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!