

ఒకప్పుడు వృద్ధాప్యంలో కనిపించే కండరాల క్షీణత ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనే కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కండరాల పరిమాణం, బలం, శారీరక సామర్థ్యం క్రమంగా తగ్గిపోవడాన్ని ‘సార్కోపీనియా’ అంటారు. గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు, వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాలు ఈ సమస్యను పెంచుతున్నాయి. తరచూ అలసట, మెట్లు ఎక్కడంలో ఇబ్బంది, నడక వేగం తగ్గడం, శరీర సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు ప్రారంభ సంకేతాలుగా ఉండొచ్చు.
మధుమేహం నియంత్రణలో లేకపోవడం, ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం, వయసుతో పాటు హార్మోన్లలో వచ్చే మార్పులు కూడా కండరాల క్షీణతకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు చేసే క్రాష్ డైట్లు, అధిక ఉపవాసాలు, కొన్ని బరువు తగ్గించే మందుల వల్ల కొవ్వుతో పాటు కండరాలు కూడా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కండరాల ఆరోగ్యానికి పాలు, గుడ్లు, చేపలు, చికెన్, పెరుగు, పప్పులు, సోయా వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్-డి, విటమిన్-బి12, కాల్షియం లోపాలు లేకుండా చూసుకోవాలి. రోజువారీ నడకతో పాటు వారానికి రెండు, మూడు రోజులు వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలు, స్క్వాట్స్ చేయడం ఉపయోగకరమని చెబుతున్నారు. రోజుకు 7–8 గంటల నిద్ర, వ్యాయామం, మధుమేహ నియంత్రణతో సార్కోపీనియా ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, దీని ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు మేము బాధ్యులం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు లేదా సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించి, వారి సూచనలను పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!