

రోజంతా గంటల తరబడి టీవీ చూడటం కేవలం సమయాన్ని వృథా చేయడమే కాకుండా మెదడు ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా మధ్య వయసులో ఎక్కువసేపు టీవీ చూసే అలవాటు ఉంటే జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే మెదడు భాగాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
అల్జీమర్స్ అండ్ డిమెన్షియా జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో సుమారు 1,700 మంది మధ్య వయస్కులను పరిశీలించారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్‌లలో ఎక్కువసేపు టీవీ చూసేవారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగం, ఫ్రంటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ పరిమాణంలో మార్పులు, అలాగే మెదడులోని శ్వేత పదార్థంలో మార్పులు గుర్తించారు.
అయితే టీవీ చూడటం వల్లే నేరుగా మతిమరుపు వస్తుందని ఈ అధ్యయనం చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఎక్కువసేపు మానసిక చురుకుదనం లేకుండా టీవీ చూడటం, మెదడులో మార్పులకు సంబంధం ఉండొచ్చని మాత్రమే సూచించారు. పుస్తకాలు చదవడం, పజిల్స్ ఆడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం, వ్యాయామం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచవచ్చని సూచించారు.
గమనిక: గంటల తరబడి టీవీ చూడటం వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. స్క్రీన్ సమయాన్ని తగ్గించి, మెదడును చురుకుగా ఉంచే పనులు చేయాలని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!