

అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. క్వాంటం బయో వ్యాలీపై మరింత చర్చించేందుకు కేంద్రం నుంచి సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపనున్నట్లు తెలిపారు. చంద్రబాబు సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబుతో కలిసి పాల్గొన్న సందర్భంగా నడ్డా ఈ విషయాలను వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంజీవని కార్యక్రమాన్ని కూడా జేపీ నడ్డా ప్రశంసించారు. ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, నివారణ, మెరుగైన చికిత్సతో పాటు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించడంపై దృష్టి పెట్టిన ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. చంద్రబాబు విజన్, నిబద్ధతను కొనియాడిన నడ్డా.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. వైద్యారోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, జీవన విధానంతో వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. సాగునీటి రంగంలో పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులపై చంద్రబాబు చూపుతున్న చిత్తశుద్ధిని కూడా నడ్డా అభినందించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!