

ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెరకెక్కుతున్న ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ చిత్రంలోని పాటలపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ఇటీవల విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాట సంగీతంపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రతి ఒక్కరి అభిప్రాయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలన్న యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఒక పాట తుది రూపం దాల్చడానికి ఎంతో ఆలోచన, సమయం అవసరమని, సంగీతాన్ని తొందరగా అంచనా వేయకూడదని అన్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఆస్కార్ విజేత హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కూడా భాగమయ్యారు. జిమ్మర్ భాగస్వామ్యం వల్ల అంతర్జాతీయ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరుగుతోందని రెహమాన్ తెలిపారు. ఐదు భాషల్లో హాలీవుడ్, భారతీయ వెర్షన్లకు వేర్వేరుగా సంగీతం అందించాల్సి వచ్చిందని, దాదాపు పది చిత్రాలకు సరిపడా పని చేసినట్లుగా అనిపించిందని వెల్లడించారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం నవంబరు 5న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!