

మురసు తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు చర్యలు, క్షేత్రస్థాయి సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం నుంచి అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు. దక్షిణ కోస్తాంధ్ర, దిగువ ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో వర్షాల కారణంగా వరద ప్రవాహాలు పెరిగి సుమారు 13 నుంచి 15 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
విద్యుత్ శాఖను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సుమారు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి తరలించామని, మురసు తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సుమారు 8 వేల స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేసినట్లు వివరించారు. అవసరమైన సామగ్రి, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో నీటిని సమర్థంగా నిర్వహించి చెరువులు, రిజర్వాయర్లలో నిల్వ చేయాలని ఆదేశించారు. గత తుఫాన్‌తో పోలిస్తే మురసు ప్రభావం తక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేసినా, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!