

ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు కార్యకలాపాలను వేగవంతం చేసుకునేందుకు పలు కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచుతున్నాయి. అయితే ఏఐ టెక్నాలజీ అభివృద్ధి, నిర్వహణకు భారీగా ఖర్చవుతుండటంతో సంస్థలు వ్యయ నియంత్రణ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్‌ఏఐ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ సామాజిక మాధ్యమంలోని గ్రోక్ ఏఐ చాట్‌బాట్ నిర్వహణకు భారీ మొత్తంలో ఖర్చవుతోందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సేవ ద్వారా వస్తున్న ఆదాయం కంటే నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రోక్ వారపు వినియోగ పరిమితి త్వరగా పూర్తవుతోందని ఓ వినియోగదారు చేసిన ఫిర్యాదుపై స్పందించిన మస్క్.. సర్వర్ ఖర్చులు మరింత పెరగకుండా కఠినమైన వినియోగ పరిమితులను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఏఐ రంగంలో పెట్టుబడుల కోసం అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు చేస్తున్న అప్పులు గణనీయంగా పెరుగుతున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా వంటి సంస్థల మొత్తం అప్పు 2025లో సుమారు 399 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 మధ్య నాటికి దాదాపు 578 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ఇది సుమారు 45 శాతం పెరుగుదల కాగా, భారత కరెన్సీలో దాదాపు రూ.54 లక్షల కోట్లకు సమానం. ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి, అధునాతన మోడళ్ల నిర్వహణ, కంప్యూటింగ్ సామర్థ్యాల విస్తరణకు భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. దీంతో ఏఐ రంగంలో పోటీ పెరుగుతున్న కొద్దీ నిర్వహణ ఖర్చులు, అప్పుల భారం కంపెనీలకు సవాలుగా మారుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!