

ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ప్రభావానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో హీరో ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బాహుబలి’ తొలి భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమయంలో, దర్శకుడు పూరి జగన్నాథ్ చికిత్స కోసం బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారని చెప్పారు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఆయన భారతదేశం నుంచి వచ్చారని తెలుసుకున్న వెంటనే ‘బాహుబలి’ గురించి ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
పూరి జగన్నాథ్ తన మొబైల్‌లో ప్రభాస్‌తో ఉన్న ఫొటోను చూపిస్తూ తాను ఆయనకు సన్నిహితుడినని చెప్పడంతో, ఆస్పత్రి సిబ్బంది వెంటనే ప్రత్యేక గదికి తీసుకెళ్లి చికిత్స అందించారని ప్రభాస్ తెలిపారు. ఈ విషయాన్ని పూరి వాయిస్ మెసేజ్ రూపంలో తనకు పంపించారని, ఆ సమయంలో రాజమౌళి, శోభు యార్లగడ్డతో కలిసి విని ఆశ్చర్యపోయామని చెప్పారు. ఇదే డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క చేసిన వ్యాఖ్యలు ‘బాహుబలి 3’పై కూడా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!