

'తమ్ముడు' చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న నితిన్ తన తదుపరి చిత్రాన్ని ఎంతో ఆలోచించి ఎంపిక చేసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పలు కథలను పరిశీలించిన అనంతరం కొత్త దర్శక ద్వయం సోము–నర్రి చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, సెట్స్ నుంచి బయటకు వచ్చిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణ మధ్యతరగతి యువకుడి పాత్రలో నితిన్ కనిపించనున్నట్లు తెలుస్తుండగా, ఆయన కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక కథానాయిక ఎంపికలో కూడా కీలక మార్పు జరిగినట్లు టాలీవుడ్లో చర్చ సాగుతోంది. తొలుత రితికా నాయక్ పేరును పరిశీలించిన చిత్రబృందం, అనంతరం 'బేబీ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్యను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా లీకైన షూటింగ్ దృశ్యాల్లో నితిన్‌తో పాటు ఆమె కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం సహజమైన భావోద్వేగాలతో కూడిన కథగా రూపొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!