

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాకపోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే నిర్మాణ సంస్థ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో విడుదల తేదీపై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఓటీటీ ఒప్పందాలు, విడుదల ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ముగిసేలోపు సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం వేగంగా పనులు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాటలు, స్వల్ప ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలి ఉండగా, ప్రభాస్ మరోవైపు ‘స్పిరిట్’ షూటింగ్‌ను సమాంతరంగా కొనసాగిస్తూ ఈ ప్రాజెక్ట్‌కూ సమయం కేటాయిస్తున్నాడని చెబుతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి. సరైన సమయంలో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!