

‘దందా’ సిరీస్‌తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దొర సాయి తేజ తన సినీ ప్రయాణం, కంటెంట్ క్రియేషన్, నటన, దర్శకత్వం, సోషల్ మీడియా, మార్కెటింగ్ వంటి అంశాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నతనంలోనే ప్రభాస్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాలో బాల నటుడి పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆయన.. ‘కొత్త బంగారులోకం’, ‘హై స్కూల్’ వంటి సిరీస్‌లలో నటించారు. ‘అలా మొదలైంది’ సినిమాలోనూ చిన్న పాత్ర పోషించారు. 2016లో రామ్‌గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడిన తర్వాత సినిమా రంగంపై మరింత అవగాహన వచ్చిందని తెలిపారు. 2018లో ‘బ్యాక్ బెంచర్స్’ సిరీస్‌తో యూట్యూబ్ ప్రయాణాన్ని సీరియస్‌గా ప్రారంభించి, పలు సిరీస్‌లు, కంటెంట్ ప్రాజెక్టులు చేసిన అనంతరం సొంతంగా కంటెంట్ క్రియేషన్ సంస్థను ప్రారంభించారు. కంటెంట్ క్రియేషన్ తన బిజినెస్ అయితే.. సినిమా తన ప్యాషన్ అని ఆయన చెప్పారు.
తన పని విధానం గురించి మాట్లాడుతూ.. కంటెంట్ క్రియేటర్, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్‌గా నిరంతరం ఆలోచిస్తానని సాయి తేజ తెలిపారు. తనకు తానే కొత్త విషయాలు నేర్చుకోవడం, ఎదురుదెబ్బల నుంచి పాఠాలు తీసుకోవడం తన అలవాటని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలను సమానంగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. డిజిటల్ ఫాలోయింగ్‌ను థియేటర్ల వరకు తీసుకెళ్లే వేదికగా కంటెంట్ క్రియేషన్‌ను ఉపయోగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘దందా’లో అరవింద్ పాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, అలాంటి ఛాలెంజింగ్ పాత్రలు రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నానన్నారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి విజన్ వల్లే ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని ప్రశంసించారు. తాను సాధారణంగా సింగిల్ టేక్‌లో సన్నివేశాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని, ఎక్కువ టేక్స్ తీస్తే నిర్మాణ వ్యయం పెరుగుతుందని వివరించారు.
ప్రస్తుత కాలంలో కంటెంట్‌తో పాటు మార్కెటింగ్ కూడా ఎంతో కీలకమని సాయి తేజ అభిప్రాయపడ్డారు. ఎంత మంచి కంటెంట్ ఉన్నా.. దాని గురించి ప్రేక్షకులకు సరైన విధంగా తెలియజేసే ప్రమోషన్ లేకపోతే ఫలితం ఉండదని చెప్పారు. ‘దందా’ కోసం ప్రత్యేకమైన ప్రమోషనల్ వీడియో రూపొందించడం ప్రేక్షకులకు సిరీస్ కాన్సెప్ట్‌ను అర్థమయ్యేలా చేసిందన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని, వారి మాటలు, ప్రవర్తన, దుస్తులు, అభిప్రాయాలు కూడా ఫాలోవర్లపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో సామాన్య ప్రేక్షకులు తమను తాము చూసుకోగలిగే కథలను తెరకెక్కించాలని, ‘జీరో టు హీరో’ తరహా పాత్రలు పోషించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ స్ఫూర్తినిచ్చే కథలు, మంచి సందేశాన్ని అందించే ప్రాజెక్టులు చేయడమే తన లక్ష్యమని చెప్పారు. “ప్రేక్షకులు నా కోసం ఖర్చు చేసే డబ్బులకు న్యాయం చేయాలి” అనే ఆలోచనతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని దొర సాయి తేజ స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!