

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘కాక్‌టైల్ 2’ విజయాన్ని అందుకున్న ఆమె ప్రస్తుతం ‘రణబాలి’, ‘మైసా’ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన వ్యక్తిగత జీవితం, సామాజిక మాధ్యమాల్లో తన వైఖరి, సినిమాలపై ఉన్న భయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇతరులను అనుకరించడం కంటే నిజాయితీగా ఉండటానికే తాను ప్రాధాన్యం ఇస్తానని, తన ఆలోచనలు, స్నేహితులతో సరదా క్షణాలు, ప్రయాణ అనుభవాలను సహజంగానే అభిమానులతో పంచుకుంటానని చెప్పారు. కృత్రిమమైన వ్యక్తిత్వాన్ని సృష్టించుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే ప్రేక్షకులు తనను తమ ఇంట్లోని వ్యక్తిలా భావిస్తున్నారని తెలిపారు.
సమాజం విధించే అంచనాల కారణంగా చాలామంది తమ అసలైన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారని రష్మిక అభిప్రాయపడ్డారు. ప్రతి కొత్త సినిమా ప్రారంభమైనప్పుడు, విడుదల సమయంలో తనకు ఇప్పటికీ ఉత్కంఠ, భయం కలుగుతాయని చెప్పారు. తాను చేసే సినిమాను ఎంతో ప్రేమిస్తున్నానని, దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నానో ఆ భయం గుర్తు చేస్తుందని వివరించారు. ఎన్నో విజయాలు, అనుభవాలు వచ్చినా ప్రతి చిత్రాన్ని తొలి సినిమాలాగే భావించి కష్టపడతానని, ప్రేక్షకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ప్రధాన లక్ష్యమని రష్మిక పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!